వీకెండ్‌లో మళ్ళీ జోరందుకున్న సంక్రాంతి సినిమాలు!
Published on Jan 22, 2017 11:18 am IST

khaidi-gpsk-shatamanm
తెలుగు సినిమాకు సంక్రాంతి ఎంత పెద్ద సీజనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంక్రాంతికి తమ సినిమా వస్తే కాసుల పంట పండుతుందని ప్రతి హీరో అభిమానీ కోరుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మూడు క్రేజ్ ఉన్న సినిమాలు రాగా, అన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించి హిట్‌గా నిలిచాయి. ఇక సంక్రాంతి వారం పూర్తవ్వడంతో గత మంగళవారం నుంచి అన్ని సినిమాల కలెక్షన్స్ కాస్త తగ్గినా, నిన్న వీకెండ్ మొదలయినప్పట్నుంచీ కలెక్షన్స్ మళ్ళీ జోరందుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ మూడు సినిమాలూ మంచి వసూళ్ళనే రాబడుతున్నాయి.

ఇక తెలుగు సినిమా పెద్ద మార్కెట్స్‌లో ఒకటైన యూఎస్‌లో కూడా వీకెండ్ మొదలవ్వడంతో కలెక్షన్స్ జోరు మళ్ళీ పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ ఇప్పటివరకూ 2.3 మిలియన్ డాలర్లు వసూలు చేసి 2.5 మిలియన్ డాలర్లకు దగ్గరవుతోంది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి 1.5 మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. అదేవిధంగా చిన్న సినిమాగా వచ్చి ఈ సీజన్‌లో మంచి హిట్ కొట్టిన శతమానం భవతి యూఎస్‍లో 590కే డాలర్లు వసూలు చేసింది. ఆదివారం కూడా ఈ సినిమాలన్నీ మంచి వసూళ్ళు రాబడతాయని ట్రేడ్ భావిస్తోంది.

 
Like us on Facebook