అఖిల్ ‘హలో’ సినిమా టైటిల్ వెనకున్న సీక్రెట్ !


అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని ‘మనం, 24’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి ‘హలో’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఊహించని విధంగా ఇంత సింపుల్ గా టైటిల్ ఉండటం, అది కూడా క్యాచీగా ఉండటంతో అభిమానులు ఈ టైటిల్ ఐడియా ఎవరిచ్చారోగాని భలేగా ఉందని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఐడియా వెనకున్నది మరెవరో కాదు నాగార్జునే.

ఈ సినిమా మీద మొదటి నుండి ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలి అని ఆలోచిస్తుండగా కథలో హీరో హీరోయిన్ చేత హలో అని చెప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాడని, అందుకే ఆ టైటిల్ అయితే బాగుంటుందని దాన్ని నిర్ణయించానని అన్నారు. అనుకున్నట్టే టైటిల్ బాగా జనాల్లోకి వెళ్లిందని, విక్రమ్ కుమార్ మంచి క్రియేటర్ కాబట్టి సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.