‘సెల్ఫీరాజా’ నైజాం కలెక్షన్స్

18th, July 2016 - 11:49:47 AM

selfi-raja
కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సెల్ఫీరాజా’ అనే సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు అంతటా మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర్నుంచి మాత్రం కేవలం ఫర్వాలేదనే టాక్‌ని మాత్రమే తెచ్చుకుంది. అయితే గత కొద్దిరోజులుగా సినిమాలేవీ రాకపోవడంతో, ‘సెల్ఫీరాజా’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళనే రాబడుతున్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ఆదివారం పూర్తయ్యే సరికల్లా 1 కోటి 3 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది.

నిన్నటితో సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ చేరుకుందని సెల్ఫీరాజా టీమ్ చెబుతోంది. బీ,సీ సెంటర్స్‌లో వసూళ్ళు బాగా ఉన్నాయని, సినిమాకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతోన్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఈ సందర్భంగా తెలిపారు. జీ. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన కామ్న రనావత్ హీరోయిన్‌గా నటించారు. ఎక్కువగా స్పూఫ్‌లనే ఆధారంగా చేసుకొని నవ్వించే ప్రయత్నం చేసిన ఈ సినిమాను గోపీ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.