ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

music
ప్రసిద్ద గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దూరమైన విషాదం నుండి తేరుకోక ముందే సీనియర్ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూయడం దక్షిణాది సినీ పరిశ్రమను కలచివేస్తోంది. 87 ఏళ్ల రాజన్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న ఆదివారం బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. దక్షిణాదిన రాజన్ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. రాజన్ తన సోదరుడు నాగేంద్రతో కలిసి కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ సినిమాలకు సంగీతం అందించారు. అప్పట్లో రాజన్-నాగేంద్ర ద్వయం అంటే చాలా పాపులర్.

కన్నడలో ఎక్కువగా సినిమాలు చేసిన రాజన్ 370కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. నాలుగు దశాబ్దాల పాటు దక్షిణాదిలో లీడింగ్ సంగీత దర్శకులుగా వెలుగొందారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. రాజన్ తెలుగులో ‘మంచు పల్లకి, ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, పంతులమ్మ, నాలుగు స్తంభాలట, సొమ్మొకడిది సోకొకడిది, రెండు రెళ్ళ ఆరు, మూడు ముళ్ళు, పూజ, ఇంటింటి రామాయణం’ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శకులు ఎక్కువగా రాజన్ చేత బాణీలు కట్టించుకోవడానికి ఇష్టపడేవారు.

Exit mobile version