సినీ దిగ్గజాలని పరిచయం చేసిన ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత !దర్శకరత్న దాసరి నారాయణరావు, రావుగోపాల్‌రావు, ఎస్పీ బాలు, కోడి రామకృష్ణ, గొల్లపూడి ఇలా సినీ దిగ్గజాలని తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఇకలేరు. జూబ్లీహిల్స్‌ లోని ఆయన ఇంటిలో ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. కోటిపల్లి రాఘవ ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌ పై తాతమనవడు, సంసారం సాగరం, తరంగిణి, తూర్పు పడమర లాంటి గొప్ప చిత్రాలను నిర్మించారు.

తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామంలో ఆయన పుట్టి పెరిగారు. దాదాపు 30 చిత్రాలకు పైగా ఆయన నిర్మించారు. నిర్మాతగా పలు నంది అవార్డులును అందుకున్న ఆయన, అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును సైతం అందుకున్నారు. కాగా ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో జరగనున్నాయని తెలుస్తోంది.