ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పిన దర్శకుడు శంకర్ !

22nd, March 2017 - 05:25:15 PM


ఇండియాలోని టాప్ సినీ దర్శకుల జాబితాలో ఒకరైన శంకర్ మీడియాకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే తాజాగా ‘రోబో-2’ షూటింగ్ జరుగుతున్న లొకేషన్లో కొందరు మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు యత్నించగా అక్కడే ఉన్న బౌన్సర్లు కొందరు వారిని అడ్డుకునే ప్రయత్నంలో దాడికి దిగారు. దీంతో ఆ జర్నలిస్టులు పోలీస్ స్టేషన్లో రోబో 2 టీమ్ పై కంప్లైంట్ ఇచ్చారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన బౌన్సర్లలో ఒకర్ని అరెస్టు చేశారని కూడా వార్తలొచ్చాయి. దీంతో విషయాన్ని ఇంతకన్నా సీరియస్ చేయడం ఇష్టంలేని దర్శకుడు శంకర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు బహిరంగా క్షమాపణలు తెలిపారు. ఇది తన దృష్టికి రాకుండా జరిగిందని, ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. దీంతో జర్మలిస్టులు పెట్టిన కేసును విత్ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం రోబో చివరి దశ ప్యాచ్ వర్క్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.