పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ తిరిగొచ్చిన శృతి హాసన్ !


ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదల కానున్న భారీ ప్రాజెక్టుల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం కూడా ఒకటి. పవన్ గత చిత్రం అనుకున్న స్థాయి ఫలితం ఇవ్వకపోవడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ గత కొన్ని రోజులుగా విదేశీ టూర్లో గడిపి తన షెడ్యూల్ మొదలవడంతో ఈరోజే హైదరాబాద్ తిరిగొచ్చింది.

‘హలో హైదరాబాద్. కాటమరాయుడు షూట్ కోసం తిరిగొచ్చాను. ముందు ముందు చాలా మంచి వర్క్ ఉంది’ అంటూ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని శృతి స్వయంగా తెలియజేసింది. కొత్తగా మొదలైన ఈ షెడ్యూల్ లో పవన్, శృతి హాసన్ లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది. ఆఖరి దశ షూటింగ్లో ఉన్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరులో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దర్శకుడు డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.