“సిరివెన్నెల” పాటకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన శ్యామ్ సింగరాయ్..!

Published on Dec 4, 2021 10:25 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌ని డిసెంబర్ 7వ తేదిన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో, ఈ పాట చిత్ర యూనిట్‌కి మరియు తెలుగువారికి ఎంత స్పెషల్‌గా ఉండబోతుందో తెలియజేసేందుకు నాని మరియు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ నవంబర్ 3న సిరివెన్నెల ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగోలేదని పాట పూర్తి చేయలేనేమో వేరే వారితో రాయిద్దామని చెప్పారు. అయితే ఈ పాటను మీరే పూర్తి చేయాలని కోరామని, మరుసటి రోజు దీపావళి నాడు ఫోన్ చేసి పాట పల్లవిని రాసుకోమని చెప్పాడు. సిరివెన్నెల గారు చెబుతుంటే నా పక్కనే ఉన్న మహాభారతం పుస్తకంలో ఆరు లైన్లు రాసుకున్నాని, ఆ పల్లవిలో మొదటి పదం సిరివెన్నెల అని ఉందని, మొదటి పదంలోనే మీ సంతకం ఇచ్చారు ఎందుకు సర్ అని అడగ్గా బహుశా ఇదే నా ఆఖరి పాట కావచ్చని నవ్వుతూ అన్నాడని, విచిత్రం ఏంటంటే ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఈ పాటను రికార్డ్ చేశామని, అందుకే మీ పేరే పెట్టుకున్నాం.. సిరివెన్నెల అని ఎమోషనల్ అయ్యాడు.

నాని మాట్లాడుతూ సిరివెన్నెల చాలా ప్రత్యేకమైన పాట, ఎందుకంటే ఇది లెజెండ్‌ లిరికిస్ట్‌కి చివరి పాట. అలాగే ఆయన రాసిన మరో పాట కూడా త్వరలో విడుదల కానుంది. ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాని సిరివెన్నెల గారికి అంకితం చేస్తున్నామని అన్నారు.

ఇకపోతే సిరివెన్నెల పాటకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :