మెగాహీరో కోసం పాట పాడిన మరో తమిళ స్టార్!

simbu
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘తిక్క’ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ పాట పాడడం కొద్దిరోజుల క్రితం బాగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తమిళంలో అంత పెద్ద స్టార్ అయిన ధనుష్, సాయిధరమ్ తేజ్ సినిమాకు ప్రత్యేకంగా తిక్క బేబి అనే పాట పాడడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమాలోని మరో పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడారు. సంగీత దర్శకుడు థమన్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ, తిక్క సినిమాలో శింబు ప్రత్యేకంగా ఓ పాట పాడారని స్పష్టం చేశారు.

ఇక ధనుష్ పాడడంతోనే ఈ ఆడియోకు ప్రత్యేకత రాగా, ఇప్పుడు శింబు కూడా మరో పాడడంతో ‘తిక్క’ ఆడియోపై అంచనాలు బాగా పెరుగుతాయని ఆశించొచ్చు. ఈ ఇద్దరు హీరోలూ గతంలో సింగర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్న వారు కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తిక్క సినిమాను రోహిణ్ రెడ్డి నిర్మించారు. జూలై 30న ఆడియో విడుదల కానుండగా, ఆగష్టు 13న సినిమా విడుదల కానుంది.