ఎట్టకేలకు ‘సింగం 3’కి రిలీజ్ డేట్ దొరికింది!


హీరో సూర్యకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టిన సినిమా ‘సింగం’. ఆ తర్వాత దానికి రెండో భాగం ‘సింగం 2’ విడుదల కాగా అది కూడా బంపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడదే సిరీస్‍లో భాగంగా, సూర్య సూపర్ మాస్ హీరోగా నటించిన ‘సింగం 3’ జనవరి 26న విడుదల కావాల్సింది. అయితే తమిళనాడులో జల్లికట్టుకు సంబంధించి కొన్ని ఆందోళనలు జరిగిన నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు. అంతకుముందే డిసెంబర్ నుంచి జనవరికి వాయిదా పడిన సినిమా, జనవరిలో కూడా విడుదల కాలేకపోయింది.

దీంతో ఇక విడుదల తేదీని మార్చొద్దన్న ఆలోచనతో ఫిబ్రవరి 9వ తేదీని పక్కాగా ఫిక్స్ చేశారట. ఈసారి ఏ అవాంతరాలూ లేకుండా సినిమా విడుదలవుతుందని టీమ్ అభిప్రాయపడింది. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.