‘సింగం 3’ టీజర్ రిలీజ్ డేట్ అదేనా ?

singham-21
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హరి చేస్తున్న చిత్రం ‘సింగం 3’. మునుపు ఈ సిరీస్ లో వచ్చిన ‘సింగం, సింగం 2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర టీమ్ చెన్నైలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇది పూర్తవగానే అక్కడే ఓ పాటను షూట్ చేసి అనంతరం టీమ్ సెప్టెంబర్ 20న మలేషియా వెళ్లనుంది. మలేషియాలో షెడ్యూల్ సుమారు వారంపాటు ఉండనుంది. మొదట మలేషియా షెడ్యూల్ సెప్టెంబర్ 26 నుండి అనుకున్నా తరువాత 20కి మార్పు చేశారు.

అది పూర్తవగానే చివరి సాంగ్ ను అక్టోబర్ ఫస్ట్ వీక్లో షూట్ చేసి చిత్రీకరణను ముగిస్తారు. కానీ అంతకు ముందే టీజర్ ను విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. సినీ సర్కిల్స్ లో వినబడుతున్న వార్తల ప్రకారం మలేషియా షెడ్యూల్ ప్రారంభం రోజున అనగా సెప్టెంబర్ 20న టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.