‘సింగం 3’ ఆడియో విడుదల ఎప్పుడంటే..!

21st, November 2016 - 09:13:57 AM

singam-3
‘గజిని’ సినిమాతో తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ సూపర్ స్టార్ సూర్యను ఇక్కడా స్టార్‌ను చేసిన సినిమాలు.. ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం – యముడు 2). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాయే ‘సింగం 3’. తెలుగులో యముడు 3 పేరుతో వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 17న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళగా, తాజాగా ఆడియో రిలీజ్‌తో టీమ్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది.

తమిళ వర్షన్ ఆడియో ఈనెల 27న చెన్నైలో జరగనుండగా, డిసెంబర్ 5న హైద్రాబాద్‌లో తెలుగు వర్షన్ ఆడియో రిలీజ్ జరగనుంది. హైద్రాబాద్‌లో జరిగే ఈవెంట్‌ను కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది. హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించగా, హరీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.