
‘లెజెండ్’ సినిమాతో తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహన్, పండగ చేస్కోలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో అందరినీ మెప్పించింది. తాజాగా బాలయ్యతో మరోసారి జత కట్టేందుకు ఈ భామ సిద్ధమైపోయింది. నందమూరి నటసింహం బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’లో ఓ హీరోయిన్గా సోనాల్ చౌహన్ ఎంపికైంది. బాలీవుడ్లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల ఫేం శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం డిక్టేటర్ సినిమా విషయంలో విశేషంగా కనిపిస్తోంది. ఇలా ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఒక హీరోయిన్గా అంజలి ఎంపిక జరిగిపోగా, రెండో హీరోయిన్గా సోనాల్ చౌహన్ ఎంపికైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.