పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రమోషన్లను దర్శకుడు మారుతి గట్టిగా చేస్తున్నారు. హారర్ ఫాంటసీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. భారత్‌లో జనవరి 8న పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉండనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌ను ప్రభాస్ తెలుగు అభిమానులు ఎంజాయ్ చేసేలా రూపొందించామని, సెకండ్ హాఫ్ మాత్రం నార్త్ ఇండియా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. “సాధారణంగా నార్త్ ప్రేక్షకులకు హారర్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఫాంటసీ ఎలిమెంట్‌ను మరింత కొత్తగా తీర్చిదిద్దాం. ఫస్ట్ హాఫ్‌లో ఇటీవల కాలంలో మిస్ అయిన ప్రభాస్ గారి సరదా స్వభావాన్ని చూపించాం. ప్రీ-ఇంటర్వెల్ తర్వాత నుంచి హిందీ ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. బాలీవుడ్ హిట్ ‘స్త్రీ’కి పని చేసిన సుమిత్ హిందీ వెర్షన్ డైలాగ్స్ రాస్తున్నారు” అని మారుతి తెలిపారు.
“ఇది డబ్బింగ్ సినిమా అనిపించకుండా డబ్బింగ్‌పై చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. సుమిత్, ఆయన అసిస్టెంట్ కూడా సినిమా చాలా బాగుందని చెప్పారు. హిందీ ప్రేక్షకులకు ఇది స్ట్రెయిట్ హిందీ సినిమా అనే ఫీల్ ఇస్తుంది. ఒకప్పుడు శ్రీరామ్కృష్ణ గారు తమిళ సినిమాలను స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లా అనిపించేలా చేసినట్టే, ‘ది రాజా సాబ్’తో కూడా అలాంటి ఇంపాక్ట్ తీసుకురావాలని ప్రయత్నించాం” అని మారుతి అన్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
