రేపు సాయంత్రం నుండే మొదలుకానున్న ‘బాహుబలి’ సందడి !

26th, April 2017 - 04:43:25 PM


బాహుబలి-2 విడుదలకు ఇంకొక్క రోజు సమయం మాత్రమే మిగిలుంది. దీంతో ఈరోజు ఉదయం నుండే టికెట్ల హడావుడి మొదలైంది. ప్రేక్షకులంతా ముందుగా ప్రీమియర్ షోలు ఎప్పుడు వేస్తారా అని ఎదురుచుశారు. థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర నిర్మాతలు కూడా 28 ముందురోజు 27 న అర్థరాత్రి 12 గంటల నుండి స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతివ్వాలని అధికారులను కోరారు. కానీ అనుమతులు దొరకలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి ప్రీమియర్లు కాకుండా వాటికంటే ముందే కొత్త పద్దతిలో పెయిడ్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారు.

రేపు రాత్రి 9 గంటల 30 నిముషాల నుండి హైదరాబాద్లో ఈ షోలను వేయనున్నారు. అన్ని మల్టీ ప్లెక్స్ థియేటర్లలోను, దేవి, సుధర్శన్ వంటి సింగిల్ స్క్రీన్లలోను ఈ షోలు వేయనున్నారు. ఇప్పటికే ఈ షోల తాలూకు బుకింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 8000 థియేతారలకు పైగానే రిలీజవుతోంది. కొన్ని చోట్ల ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా సినిమాను ప్రదర్శించనున్నారు.