స్పైడర్‌మ్యాన్‌ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి పీటర్ పార్కర్ ఎదుర్కొనే అతిపెద్ద ముప్పు ఏంటంటే?

Spidy

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ అభిమానులకు పండగ లాంటి వార్త. అందరి ఫేవరెట్ సూపర్ హీరో ‘స్పైడర్ మ్యాన్’ సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ‘స్పైడర్‌మ్యాన్‌: బ్రాండ్ న్యూ డే’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. న్యూయార్క్ సిటీలో సూర్యోదయం వేళ, ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైనుంచి హీరో టామ్ హాలండ్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ ఈవెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈసారి పీటర్ పార్కర్ జర్నీ మునుపటి కంటే మరింత సీరియస్, ఎమోషనల్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

గతంలో వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్‌: నో వే హోమ్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా ముగిసిన నాలుగేళ్ల తర్వాత ఏం జరిగిందనే పాయింట్‌తోనే ఈ ‘బ్రాండ్ న్యూ డే’ కథ మొదలవుతోంది. తనను ప్రేమించే వాళ్ళ జీవితాల నుంచి, వారి జ్ఞాపకాల నుంచి పూర్తిగా దూరమైపోయాడు పీటర్ పార్కర్. ఇప్పుడు అతను ఒంటరి. పీటర్ అనే పేరు కూడా ఆ సిటీకి గుర్తులేదు. కేవలం స్పైడర్‌మ్యాన్‌గా మాత్రమే బతుకుతూ న్యూయార్క్ నగరానికి ఫుల్ టైమ్ రక్షకుడిగా మారాడు.

ఈ క్రమంలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త శత్రువు సిటీపై పంజా విసురుతాడు. హీరో శక్తి సామర్థ్యాలకు మించిన ఈ పవర్‌ఫుల్ విలన్‌ను ఒంటరిగా స్పైడర్‌మ్యాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా మెయిన్ థీమ్. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ బ్లాక్‌బస్టర్‌లో టామ్ హాలండ్ సరసన జెండయా మరోసారి మెరవనుంది. జాకబ్ బాటలన్, జోన్ బెర్న్తల్, మార్క్ రఫెలో వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది థియేటర్లలో సందడి చేయనుంది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఊహించని ట్విస్టులతో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version