చెన్నైలో ‘స్పైడర్’ హవా స్పష్టంగా కనబడింది!


సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న విడుదలైన ‘స్పైడర్’ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అధికారికంగా లాంచ్ అయిపోయారు. టాప్ డైరెక్టర్లలో ఒకరైన మురుగదాస్ తెరకెక్కించిన ఈ ద్విభాషా చిత్రంపై ఆరంభం నుండి తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. అందరూ కొత్త హీరో లాంచింగ్ కోసం ఎదురుచూసినట్టు చూశారు. ఆ క్రేజ్ వల్లనే ‘స్పైడర్’ ఓపెనింగ్ డే రోజున మంచి వసూళ్లను రాబట్టింది.

చెన్నై ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ‘స్పైడర్’ తమిళ వెర్షన్ నిన్న చెన్నై సిటీలో రూ. 46 లక్షలు గ్రాస్ వసూలు చేయగా తెలుగు వెర్షన్ రూ.16 లక్షల గ్రాస్ అందుకుంది. ఈ మొత్తం కలిపి నిన్న మొదటిరోజు రూ.64 లక్షల గ్రాస్ నమోదైంది. ఒకరకంగా చెప్పాలంటే ఇవి మంచి వసూళ్లే. పైగా అక్కడ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో పూర్తిగా మహేష్ హావానే కనబడింది. కాబట్టి మహేష్ కు తమిళంలో ప్రాపర్ లాంచింగ్ దొరికిందనే అనుకోవాలి. ఇకపోతే ఓవర్సీస్లో సైతం సినిమా ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసేంది.