ఓవర్సీస్లో 400 లకు పైగా లొకేషన్లలో విడుదలకానున్న ‘స్పైడర్’ !

12th, September 2017 - 08:29:49 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్పైడర్’ ఈ నేప 27న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుతో పాటు యూఎస్ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర హక్కులు భారీ ధరకు అమ్ముడవడం, ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఉన్న ఆసక్తి వలన ఆరంభంలోనే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ రాబట్టాలనే ఉద్దేశ్యంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

సుమారు 400 లకు పైగా లొకేషన్లలో చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే రెండవ అతిపెద్ద రిలీజ్ కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో తెలుగు వెర్షన్ ను 600 లకు పైగా స్క్రీన్లలో, తమిళ వెర్షన్ ను కూడా భారీగానే విడుదలచేయనున్నారు. సెప్టెంబర్ 26 న రాత్రి ప్రీమియర్ల ద్వారా ప్రదర్శన మొదలుకానుంది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో మహేష్ తమిళంలో అధికారికంగా లాంచ్ కానున్నారు.