విడుదల తేదీ : అక్టోబర్ 09 , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : శ్రీవిష్ణు, మహిమా నంబియార్, సత్య, సుదర్శన్, రాధిక, ఉపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో తదితరులు
దర్శకత్వం : జానకిరామ్ మారెళ్ల
నిర్మాత : వెంకట కృష్ణ కర్ణాటి
సంగీతం : విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
కూర్పు : చోటా కే ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినూత్న సబ్జెక్టు లతో అలరించే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.
కథ:
కళ్యాణ్ (శ్రీవిష్ణు) తన ఊరికి ఉన్న పెద్ద దగ్గర ఒక సినిమా థియేటర్‌ను లీజుకు తీసుకుని స్నేహితుడితో కలిసి నడుపుతుంటాడు. ఆ సమయంలో తనకు సాయం చేసిన ఒడియా అమ్మాయి సితార (మహిమా నంబియార్)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను దక్కించుకునే క్రమంలో కళ్యాణ్ ఊహించని విధంగా ఒక నక్సలైట్ ముఠాలో చేరాల్సి వస్తుంది. దాంతో అతడు చావో రేవో తేల్చుకోవాల్సిన సంక్లిష్ట పరిస్థితిలో పడతాడు. ఆ సమస్యల నుంచి కళ్యాణ్ ఎలా బయటపడ్డాడనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదేదో సీరియస్ కంటెంట్ లా ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇందులో అందుకు భిన్నంగా ఫన్ ట్రీట్ దొరుకుతుంది. దర్శకుడు దీనిని ఆద్యంతం వినోదభరితంగా మంచి ఫన్ మూమెంట్స్ తో డిజైన్ చేశారు. తెలుగు తెరపై నక్సలిజం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా, ఈ చిత్రంలో ఆ అంశాన్ని పూర్తిస్థాయి కామెడీ కోణంలో నడిపించిన తీరు ఇంప్రెస్ చేస్తుంది.
ఇక హీరోయిన్ ఎంట్రీతో కథనం ఊపందుకుంటుంది. కమెడియన్ సత్య పాత్ర వచ్చాక కామెడీ డోస్ మరింత పెరుగుతుంది. శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ టైమింగ్‌తో అలరించారు. కేవలం నవ్వించడానికే పరిమితం కాకుండా పాత్రలోని భావోద్వేగాలను పరిణతితో పండించాడు.
శ్రీవిష్ణు, సత్య కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మహిమా నంబియార్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకోగా.. సుదర్శన్, రాధిక, ఉపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమా స్టార్ట్ మాత్రం స్లోగా మొదలైంది అని చెప్పాలి. హీరో ఎంట్రీ ఇచ్చేవరకు కథనంలో మూమెంట్స్ స్లోగా కొంచెం డల్ అనిపిస్తాయి. ఆ తర్వాత పికప్ అయ్యాయి. అప్పుడు వరకు కథనం అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించదు. వీటితో పాటు పాత్రల పరిచయం కూడా అంత బలంగా కుదరలేదు అనిపిస్తుంది.
అంతే కాకుండా ఆరంభంలో వచ్చే కొన్ని జోకులు ఆశించిన స్థాయిలో పేలకపోగా, అక్కడక్కడా డబ్బింగ్ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. సెకండాఫ్ లో కథనం ఫ్లో కాస్త మందగిస్తుంది. కీలక సమయంలో వచ్చే హీరో ఎలివేషన్ సాంగ్ మరింత ఇంపాక్ట్ కలిగించేలా ఉండాల్సింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అంతగా కన్విన్స్ చేయలేకపోయాయి. ఎండింగ్ కూడా ఇంకాస్త ప్రభావవంతంగా ఇచ్చి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
ఇందులో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం డీసెంట్ గా ఉన్నాయి, కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత బలంగా ఉండాల్సింది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ ఎక్కువ భాగం బాగానే ఉన్నా, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది.
రచయితలు భాను భోగవరపు, నందు సవరిగాన హీరో చుట్టూ అల్లిన కాన్‌ఫ్లిక్ట్‌కు వినోదాన్ని చక్కగా జోడించారు. ప్రమోషనల్ కంటెంట్ కంటే వెండితెరపై కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఇక ఈ కథకు దర్శకుడు జానకిరామ్ మారెళ్ల మంచి ఎగ్జిక్యూషన్ అందించారు. నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లు టైమింగ్ లను తాను రాబట్టారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూస్తే, ‘కామ్రేడ్ కళ్యాణ్’ మంచి ఫన్ మూమెంట్స్ తో సాగే టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. శ్రీవిష్ణు, సత్యల కామెడీ ట్రాక్ థియేటర్ లో మంచి ఫన్ ని జెనరేట్ చేస్తుంది. ఆరంభ సన్నివేశాలు, క్లైమాక్స్ కాస్త తడబడినా.. ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఇందులో కొదవ లేదు. సో ఈ వారాంతానికి ఓ డీసెంట్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకుంటే ఇదొక ఛాయిస్ గా నిలుస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
