ఫిక్స్.. చిరు 151వ సినిమా అదే !
Published on Feb 27, 2017 1:23 pm IST


మెగాస్టార్ చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం ‘ఖైదీ నెం 150’ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసి మళ్ళీ నెంబర్ వన్ స్థానాన్ని అధిష్టించడం చక చకా జరిగిపోయాయి. మెగా అభిమానులు కూడా ఈ అపూర్వ ఘట్టంతో చాలా ఆనందించారు. ఆ సంబరంలోనే చిరంజీవి 151వ సినిమాగా ఏ సబ్జెక్ట్ చేస్తారు అనే ప్రశ్న అభిమానులు, సినీ వర్గాల్లో తలెత్తింది. ఆ ప్రశ్నతో పాటే కొన్నేళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథనే చిరంజీవి చేస్తారనే వార్తలు పుట్టుకొచ్చాయి.

మరోవైపు చరణ్ మెగాస్టార్ 151 వ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడని, తానే నిర్మిస్తానని అన్నాడే కానీ కథేమిటో చెప్పలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ ఎక్కువైపోయాయి. ఇలాంటి ఉత్కంఠ సమయంలో చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన నటుడు శ్రీకాంత్ చిరు 151వ చిత్రం ఏమిటనేది స్పష్టం చేశాడు. ప్రముఖ న్యూస్ ఛానెల్ తో ఒక ప్రోగ్రామ్లో పాల్గొన్న శ్రీకాంత్ మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు, రాయలసీమ వాసి అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాధనే చిరంజీవి 151వ సినిమా చేయబోతున్నారని క్లారిటీగా చెప్పేశాడు.

శ్రీకాంత్ చెప్పిన ఈ వార్తతో మెగాస్టార్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మొదటిసారి చిరంజీవి ఒక వాస్తవ గాథలో అదీ శక్తివంతమైన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించబోతుండటంతో సినిమా ఎలా ఉంటుంది, చిరు ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడు, సురేందర్ రెడ్డి ఎంత గొప్పగా సినిమాను డైరెక్ట్ చేస్తాడు అనే ప్రశ్నలు వేసుకుంటూ చిరంజీవి చెప్పబోయే అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

 
Like us on Facebook