
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద నాలుగో వారం కూడా అదే సత్తా చాటుతోంది. ఇప్పటికే తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో స్థానంలో నిలబడి మహేష్ స్టామినాను మరోసారి చూపించిన ‘శ్రీమంతుడు’ సినిమా, నాలుగో వారమైనా అదే కలెక్షన్స్ సాధిస్తూ ఉండడం విశేషంగా కనిపించింది.
ఇక ఈ వారాంతం వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కూడా కావడంతో శ్రీమంతుడు థియేటర్ల వద్ద అభిమానులు, ప్రేక్షకుల హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లోని మహేష్‌కు స్ట్రాంగ్ బాక్సాఫీస్ పొటెన్షియల్ ఉన్న ఏరియాల్లో ఈ వారం కూడా సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. సినిమా ఫైనల్ కట్లో తొలగించబడిన రెండు సన్నివేశాలను ఈ వారం నుంచే కలిపి ప్రదర్శించడం ఈ సినిమా నాలుగో వారానికి స్ట్రాంగ్ సపోర్ట్‌నిచ్చింది. ఇక ఇదే స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తే శ్రీమంతుడు తెలుగు సినిమాకు మరో మరచిపోలేని హిట్‌నిచ్చిన సినిమాల జాబితాలో చేరుతుందనడంలో సందేహం లేదు.