‘బాహుబలి’ టీవీ సీరియల్ ను కన్ఫర్మ్ చేసిన రాజమౌళి !


ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సిరీస్లోని రెండవ భాగం ‘బాహుబలి – ది కంక్లూజన్’ కూడా ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని శక్తివంతమైన, అతి ముఖ్యమైన శివగామి పాత్రను ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ పేరుతో మూడు పుస్తకాలను రచిస్తున్నారు. ఈ పుస్తకాల్లో శివగామి పాత్ర యొక్క ఆరంభం, ఆమె మాహిష్మతి సామ్రాజ్ఞిగా ఎదిగిన విధానాన్ని వివరించనున్నారు.

ఈ సిరీస్లోని మొదటి పుస్తక ఆవిష్కారణ కార్యక్రమంలో రాజమౌళితో పాటు రానా, రమ్యకృష్ణల పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ నీలకంఠన్ ఈ పుస్తకం యొక్క ప్రీ క్లైమాక్స్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ పుస్తకాల ఆధారంగా ఒక మినీ టీవీ సీరియల్ తీద్దామని ఆలోచనలో ఉన్నాం. సీరియల్ అంటే డైలీ సీరియల్ కాదు 10 నుండి 13 ఎపిసోడ్లు ఉండేలా చేస్తాం అని అన్నారు. మరి ఈ సీరియల్లో సినిమాలోని పాత్రదారులే నటిస్తారో లేకపోతే కొత్తవాళ్లెవరైనా చేస్తారో చూడాలి.