పివి సింధు బయోపిక్ ను నిర్మించనున్న స్టార్ నటుడు !


ఈ మధ్య కాలంలో బయోపిక్ లకు ఆదరణ బాగా పెరిగింది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల పట్ల ప్రేక్షకులు ఎక్కువ ఆదరణ చూపుతున్నారు. ‘బాగ్ మిల్కా బాగ్, దంగల్, మేరీ కోమ్, ఎమ్. ఎస్ ధోని’ వంటి సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. అందుకే ప్రస్తుతం ఇండియాలో మంచి పాపులారిటీ పొందిన టెన్నిస్ క్రీడాకారులపై బయోపిక్స్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దీ రోజుల క్రితమే దర్శకుడు అమోల్ గుప్త సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా శ్రద్ద కపూర్ ప్రధాన పాత్రలో సినిమాను అనౌన్స్ చేశారు.

ఇప్పుడు మరొక స్టార్ క్రీడాకారిణి, మొదటిసారి ఒలింపిక్స్ లో ఇండియా తరపున మెడల్ సాధించి భారత ప్రభుత్వం చేత అర్జున అవార్డ్, పద్మ శ్రీ పురస్కారం అందుకున్న తెలుగుమ్మాయి పివి సింధు పై బయోపిక్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును స్టార్ నటుడు సోను సూద్ నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ సినిమాలో సింధు పాత్రను ఎవరు చేస్తారు, డైరెక్టర్ ఎవరు అనే విషయాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ విషయంపై స్పందించిన సింధు సోను సూద్ ఈ బయోపిక్ ను నిర్మించనుండటం సంతోషంగా ఉంది. ఇది ఎంతోమందకి తమ కలలను నెరవేర్చుకునే స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.