కంగారులో పడిపోయిన స్టార్ హీరో అభిమానులు !

bairava
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంటుంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆటంకాలు సినిమా క్రూ వలన కాకుండా బయటి వ్యక్తుల నుండి వస్తుంటాయి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా చేస్తున్న చిత్రం ‘భైరవ’ అలాంటి ఇబ్బందులనే ఎదుర్కుంటోంది. దర్శకుడు భరతన్ విజయ్ తో సినిమాని అని చెప్పి కొన్ని రోజుల్లో టైటిల్ ను అనౌన్స్ చేసే లోపే ‘భైరవ’ టైటిల్ బయటకొచ్చేసింది. అప్పుడు యూనిట్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు.

ఆ తరువాత షూటింగ్ మొదలైన కొన్నిరోజులకు ఫస్ట్ లుక్ కూడా అఫీషియల్ గా విడుదల చేయడానికంటే ముందే సోషల్ మీడియాలో విడుదలై టీమ్ ను కంగారు పెట్టింది. దీంతో ఈ లీకేజ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీమ్ ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదని జాగ్రత్తపడుతూ వచ్చినప్పటికీ పాటలు కొన్ని విడుదల తేదీ కంటే ముందే బయటకొచ్చేశాయి. దీంతో చేసేది లేక చిత్ర యూనిట్ ఆడియోను డైరెక్టుగా మార్కెట్లోకి విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇలా తమ అభిమాన హీరో సినిమా అడుగడుగునా లీకేజ్ ఇబ్బందులకి గురవుతుండటంతో అభిమానులంతా సినిమా థియేటర్లలోకి వచ్చే లోపు ఇంకా ఏం జరుగుతుందో అని కంగారులో పడిపోయారు.