ప్రమోషన్ల కోసం టీవీ షోలను నమ్ముకుంటున్న స్టార్లు !


ఈ మధ్యకాలంలో టీవీ రియాలిటీ, టాక్ షోలకు పెరిగిన ఆదరణ అంతా ఇంతా కాదు. సామాన్యుడికి అతి చేరువలో ఉండే ఈ టీవీ మాధ్యమం యొక్క బలాన్ని గుర్తించిన సినీ తారలంతా బుల్లితెర మీద దర్శనమిచ్చేస్తున్నారు. ప్రస్తుత యంగ్ జనరేషన్ స్టార్ హీరోలంతా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు టీవీ షోలకు హోస్టులుగా వ్యవహరించడానికి ముందుకొస్తుంటే, ఇంకొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు తన సినిమాల ప్రమోషన్ల కోసం ఆ టీవీ షోలనే నమ్ముకుంటున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ చేస్తున్న ‘బిగ్ బాస్’, రానా చేస్తున్న ‘నెం.1 యారి’ షోలకు సెలబ్రిటీల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఈ సెప్టెంబర్ 1న విడుదలకానున్న ‘పైసా వసూల్’ ను ప్రమోట్ చేసేందుకు ఎప్పుడూ టీవీ షోల్లో కనిపించని బాలకృష్ణ , ఆయనతో పాటే దర్శకుడు పూరి జగన్నాథ్ లు ఇద్దరూ రానా షోకు విచ్చేసి హడావుడి చేశారు. త్వరలోనే ఆ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

అలాగే ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ షోకు తారల రాక మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రమోషన్ల కోసం రానా కంటెస్టెంట్లతో పాటే బిగ్ బాస్ హౌస్ లో గడపగా, ‘ఆనందో బ్రహ్మ’ కోసం తాప్సి, ‘అర్జున్ రెడ్డి’ ప్రచారం కోసం విజయ్ దేవరకొండ షోలో సందడి చేశారు. పైగా రాబోయే రోజుల్లో ‘పైసా వసూల్’ కోసం పూరి, ‘స్పైడర్’ కోసం మహేష్ ఈ షోలో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ టీవీ షోల వలన ప్రేక్షకులకు వినోదం, తారలకు, వాళ్ళ సినిమాలకు ప్రచారం మెండుగా లభిస్తున్నాయి.