అంగరంగ వైభవంగా క్రిష్ పెళ్ళి!

krish
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకొని సినిమాలు తీసుకుంటూ వెళుతోన్న క్రిష్, పెళ్ళి అనే బంధంతో ఓ ఇంటివాడయ్యారు. హైద్రాబాద్‌కు చెందిన డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం గోల్గొండ రిసార్ట్స్‌లో నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో వివాహ వేడుక కళకళలాడింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాఘవేంద్రరావు, శ్రీకాంత్, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితర సినీ ప్రముఖులంతా విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

స్వతహాగా సాంప్రదాయాలను, కొత్తదనాన్ని బాగా ఇష్టపడే క్రిష్, తన పెళ్ళిని కూడా అదేవిధంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ఆయన స్వహస్తాలతో రాసిన ఆహ్వాన పత్రిక కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక క్రిష్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న ఆయన సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.