‘జనతా గ్యారెజ్’ సెట్లో ‘ఆర్య 2’ టీమ్!
Published on Aug 21, 2016 6:45 pm IST

sukumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరిదశకు చేరిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట షూటింగ్ నిన్నటివరకూ నిర్విరామంగా జరిగింది. ‘పక్కా లోకల్’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ కాజల్, ఎన్టీఆర్‌తో స్టెప్పులేశారు.

ఇక ఈ పాట షూటింగ్ జరుగుతుండగానే, దర్శకుడు సుకుమార్, నిర్మాత బాపినీడుతో కలిసి సరదాగా ‘జనతా గ్యారెజ్’ సెట్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగానే ఆయన, తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్య 2’ సినిమాలో నటించిన కాజల్, ఆ సినిమా నిర్మాత బాపినీడు, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విన్‌తో కలిసి ఓ ఫోటోకు పోజిచ్చారు. ఈ ఫోటోలో ఒక్క అల్లు అర్జున్ మాత్రమే మిస్ అయ్యారంటూ అశ్విన్ సరదాగా ఈ ఫోటోను షేర్ చేశారు.
ఇక ‘జనతా గ్యారెజ్’ విషయానికి వస్తే, ’మిర్చి’, ’శ్రీమంతుడు’ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాగా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై అంచనాలను పెంచేశాయి.

 
Like us on Facebook