సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!

Mahendragiri Varahi Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 11, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్, రాజీవ్ కనకాల తదితరులు.
దర్శకత్వం : సంతోష్ జాగర్లమూడి
నిర్మాతలు : కలిపు మధు, సురభి లక్ష్మణరావు
సంగీతం : అనూప్ రూబెన్స్,
ఛాయాగ్రహణం : ప్రతాప్ ఆర్. కృష్ణ,
కూర్పు : జునైద్ సిద్ధిఖీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

మహేంద్రగిరి అనే ఊరిలో వారాహి అమ్మవారు కొలువై ఉంటుంది. అక్కడి రాజ కుటుంబీకులు చేసిన పొరపాటు వల్ల వారాహి అమ్మవారు ఆ కుటుంబానికి శాపం విధిస్తుంది. దీని ప్రభావంతో ఆ వంశంలో పుట్టిన ప్రతి మగ బిడ్డ 33 సంవత్సరాలకు చనిపోతూ ఉంటారు. ఇది వారాహి అమ్మవారు ఆ కుటుంబానికి పెట్టిన శాపమని అందరూ నమ్ముతూ ఉంటారు. అసలు ఆ గ్రామ దేవతే వారాహి అమ్మవారు. అలాంటి అమ్మవారు ఎందుకు మనుషులను చంపుతుంది ?, కాపాడే అమ్మవారు ఎందుకు అకారణంగా అంతం చేస్తోంది ?, ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సిద్ధార్థ్ (సుమంత్) ఏం చేశాడు ?, ఈ చావుల వెనక కారణమేంటి అనేది ఎలా కనిపెట్టాడు ?, ఆ తర్వాత ఏం జరిగింది?, ఇంతకీ.. ఈ చావులకు కారణం శాపమేనా ? లేక, మరో కారణం ఉందా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సంతోష్ జాగర్లమూడి రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ ‘మహేంద్రగిరి వారాహి’లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డివోషనల్ టచ్ కూడా బాగుంది. అనుప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. సుమంత్ పాత్ర బాగుంది. నిజాన్ని బయట పెట్టే యూట్యూబర్ సిద్ధార్థ్ పాత్రలో సుమంత్ చాలా చక్కగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని అడ్వెంచర్ సన్నివేశాల్లో అలాగే సెకండాఫ్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా సుమంత్ నటన చాలా బాగుంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో పాత్రలో నటించిన మీనాక్షి గోస్వామి కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మాళవికా నాయర్ బాగా నటించింది. వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు సంతోష్ కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేసాడు. పైగా అడ్వెంచర్ సీన్స్ ను కూడా సంతోష్ చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి డివోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ.. ప్రేక్షకులు ఇన్ వాల్వ్ అయ్యేలా కనెక్ట్ కాదు.

అసలు రాజ కుటుంబీకుల శాపం.. వారి మరణాలు ఇవేవీ కొత్తగా సాగవు. గతంలో వచ్చిన కొన్ని చిత్రాల తాలూకు సంఘటనలు గుర్తుకువస్తుంటాయి. పైగా సినిమాలో ప్రధాన క్యారెక్టైజేషన్స్ కూడా.. ముఖ్యంగా విలన్ పాత్రలు బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. అన్నిటికి మించి వెన్నెల కిశోర్, బ్రహ్మానందం పాత్రలు అసహజంగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సంతోష్, ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. నిర్మాతల కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

‘మహేంద్రగిరి వారాహి’ అంటూ వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ రాసిన కథ, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, డివోషనల్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here English Review

Exit mobile version