మళయాల సినిమా రీమేక్‌లో సునీల్?

sunil
కమెడియన్‌ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన తన కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వీరుపోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డ్ ఎహె’ అన్న సినిమాను పూర్తి చేసిన ఆయన, క్రాంతి కుమార్‌తో ఓ సినిమాను చేస్తున్నారు. ఇక వీటితో పాటు మళయాలంలో ఘన విజయం సాధించిన ‘టూ కంట్రీస్’ రీమేక్‌లో సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను శంకర్ సుమారు 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా టూ కంట్రీస్ సినిమా మళయాల బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. కాగా ఈ రీమేక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.