క్రిష్ మార్క్ ఎమోషన్‌తో ‘కంచె’ కొత్త ట్రైలర్!

kanche
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి రెండు ప్రత్యేకత సంతరించుకున్న సినిమాలతో దూసుకుపోతోన్న తెలుగు సినిమాకు మరో ప్రత్యేకత చేకూర్చేందుకు వస్తోన్న సినిమాయే ‘కంచె’. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఇండియన్ సినిమాలో వస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకుడికి ఓ సరికొత్త అనుభూతినిస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉండడంతో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక కంచె టీమ్ కూడా సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా ద్వారా నటుడిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటానన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉన్న నేపథ్యంలో కంచె టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఈ క్రమంలోనే ఈ సాయంత్రం కంచె సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇక ఇప్పటికే ఫస్ట్ ట్రైలర్‌తో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, రెండో ట్రైలర్‌తో మరింతగా కట్టిపడేస్తోంది. ప్రపంచాన్ని వణికించిన ఒక యుద్ధ నేపథ్యానికి ఒక ప్రేమకథను జతచేస్తూ క్రిష్ చేసిన ఈ ప్రయోగం తెరపై ఎంత అందంగా ఉండబోతోందో ఈ ట్రైలర్‌తో మరోసారి స్పష్టమైంది. యుద్ధ నేపథ్యం, ప్రేమకథలోని ఫీల్, ఒక గ్రామీణ వాతావరణ నేపథ్యం.. ఇలా దేనికదే ఓ ప్రత్యేక మూడ్‌ను నింపుకొని ఉన్న ఈ సినిమాలో క్రిష్ మార్క్ ఎమోషనల్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉండనున్నాయన్నది ట్రైలర్ సుస్పష్టం చేస్తోంది. ఇక ఇన్ని అంచనాలతో, ప్రత్యేకతలతో వస్తోన్న సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది రెండు రోజుల్లో తేలిపోనుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version