షూటింగ్‌లో గాయపడ్డ రజనీ కాంత్!

4th, December 2016 - 09:42:30 AM

Rajinikanth
సూపర్ స్టార్ రజనీ కాంత్ కాలుజారి కిందపడడంతో గాయపడ్డారన్న వార్త నిన్న రాత్రి అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ‘2.0’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన, నిన్న రాత్రి ఫ్లోర్‌పై నడుస్తూ ఉండగా, కాలుజారి పడిపోయారట. షూటింగ్ పరిసరాల్లో పెద్ద ఎత్తున వర్షం కురవడంతో ఫ్లోర్ అంతా తడిగా ఉందట. ఇక అక్కడే కాలుజారి పడడంతో రజనీని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కాగా ఆసుపత్రిలో చిన్న ట్రీట్‍మెంట్ ఇచ్చిన వైద్య సిబ్బంది, ఆ తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపించేశారట.

ఈ ప్రమాదంలో ఆయన కుడికాలికి చిన్న దెబ్బ తగిలిందని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని రజనీ సిబ్బంది తెలిపింది. అదేవిధంగా అభిమానులు ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, రజనీ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇక కాలి నొప్పి తగ్గిన వెంటనే, రజనీ మళ్ళీ 2.0 షూటింగ్‌కు సిద్ధమవుతారు.