విశ్రాంతి తీసుకోనున్న సూపర్‌స్టార్!!

Rajinikanth
సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానుల్ని అలరించేందుకు ఈమధ్యే ‘కబాలి’తో వచ్చినా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించే వసూళ్ళు రాబట్టినా, సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు అమెరికాలో కొద్దికాలం పాటు విశ్రాంతి తీసుకున్న రజనీ, మళ్ళీ ఇప్పుడు కబాలి పనులన్నీ పూర్తవడంతో నెలరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది.

తన పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని రజనీ భావిస్తున్నారట. ఇక నెల తర్వాత మళ్ళీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రోబో 2.0’ షూటింగ్‌లో రజనీ జాయిన్ అవుతారు. ఇప్పటికే 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో ఎక్కడిలేని క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రజనీ కూడా తన కెరీర్‌కు అవసరమైన బలమైన హిట్‌గా 2.0 నిలుస్తుందని ఆశిస్తున్నారు.