సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి సినిమా!

6th, December 2016 - 12:32:57 PM

surendar
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన సినిమాకు దర్శకత్వం వహించాలన్న ఉత్సాహంతో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్‌గా కొనసాగుతోన్న వారంతా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే సెట్స్‌పై ఉన్న 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’కి కూడా మొదట ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాక, చివరకు వీవీ వినాయక్ దర్శకుడిగా ఖరారు అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన నటించబోయే సినిమాలకు కూడా ఇప్పట్నుంచే రంగం సిద్ధమవుతోంది. బ్రేక్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్న చిరంజీవి, ప్రస్తుతం పలువురు స్టార్ డైరెక్టర్స్‌తో డిస్కషన్స్ జరుపుతున్నారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్‌తో ‘ధృవ’ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ శుక్రవారం విడుదలవుతోన్న ధృవ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సురేందర్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా తెలియజేస్తూ.. “చిరంజీవి గారితో సినిమాకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుంది. ‘కిక్’ సినిమాలా ఓ యాక్షన్ కామెడీలో చిరంజీవిని చూడాలన్నది నా కోరిక. అలాంటి సినిమాయే ఆయనతో చేస్తా” అని అన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి.