టాలీవుడ్‌లో ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఏమాత్రం ఆశాజనకంగా సాగడం లేదు. సాధారణంగా పెద్ద సినిమాలతో కళకళలాడాల్సిన థియేటర్లు, ఈసారి సరైన సినిమాలు లేక వెలవెలబోతున్నాయి. గతవారం విడుదలైన సినిమాలకు ఆశించిన స్పందన లేకపోగా, ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెరుపుల్లేవు. తెలుగు నుంచి నేరుగా ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, తమిళ హీరో సూర్య నటించిన ‘వీరభద్రుడు’ ఒక్కటే ప్రేక్షకులకు ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ నిర్మించిన ఈ సినిమాపై కూడా తెలుగులో సరైన బజ్ కనిపించడం లేదు. హీరో సూర్య, హీరోయిన్ త్రిష మినహా చిత్రంలో నటించిన మిగిలిన నటీనటులందరూ తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే కావడం ఈ సినిమాకు ప్రధాన మైనస్. అయితే, ప్రస్తుతం థియేటర్లలో మరో గట్టి పోటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం.
ఒకప్పుడు తెలుగు మార్కెట్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న సూర్యకు, ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులు పలకరించాయి. ప్రస్తుతం బీ, సీ సెంటర్లలో సూర్య సినిమా అంటే అంతో ఇంతో ఆసక్తి ఉన్నప్పటికీ, ప్రమోషన్లు లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఇకనైనా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తే ‘వీరభద్రుడు’పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
