‘సింగం 3’ తర్వాత సూర్య చేయబోయే సినిమా ఇదే!

6th, September 2016 - 04:43:08 PM

suriya
తమిళ స్టార్ హీరో సూర్య తన ఇమేజ్‌కి తగ్గ ఓ బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ’24’ తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్‌గానే నిలిచినా, సూర్య స్థాయికి తగ్గ విజయంగా మాత్రం నిలవలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొత్త సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సింగం 3’ అనే పక్కా మాస్ కమర్షియల్ సినిమా ఈ దీపావళికి విడుదల కానుండగా, అప్పుడే తన తదుపరి సినిమాను కూడా ప్రకటించేశారాయన. సూర్య, ‘సింగం 3’ తర్వాత విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

‘నానుమ్ రౌడీధాన్’ (తెలుగులో నేనూ రౌడీనే) అన్న సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజ్ఞేష్, సూర్య ఇమేజ్‌కు సరిపడే మంచి కథను సిద్ధం చేశారట. ఇక ‘సింగం 3’ తర్వాత చేయబోయే సినిమాకు సుందర్ సి, పా రంజిత్, త్రివిక్రమ్.. ఇలా ఎందరో దర్శకులతో చర్చలు జరిపిన సూర్య, చివరకు విజ్ఞేష్ శివన్‌ను ఎంపిక చేయడం విశేషంగా చెప్పుకోవాలి. సూర్య సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మించనుంది.