ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం “సువర్ణ”. పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత అశోక్ రొయ్య చిత్ర విశేషాలను పంచుకున్నారు. మొబైల్ ఫోన్‌కు బానిసైన ‘సువర్ణ’ అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఆమె ఎలా మరణించింది? దెయ్యంగా ఎందుకు మారింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు.
సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అద్భుతమైన గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం (రీ-రికార్డింగ్) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “సువర్ణ” చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.
