‘మహానటి’ కి సంగీతం ఇవ్వనున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ !

5th, April 2017 - 11:15:29 AM


‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ త్వరలో ‘మహానటి’ అనే చిత్రాన్ని ప్రారంబించనున్న సంగతి తెలిసిందే. అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందివ్వనున్నారు.

‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తాజాగా ‘అ..ఆ, శతమానం భవతి’ చిత్రాలతో మెప్పించిన మిక్కీ త్వరలో విడుదలకానున్న వరుణ్ తేజ్ ‘మిస్టర్’ సినిమాకి కూడా సంగీతం అందించారు. ఇకపోతే 40, 50 ల దశకం నాటి వాతావరణంలో నడిచే ఈ ‘మహానటి’ సినిమా కోసం ఆ కాలం తరహా సంగీతాన్నే ప్రత్యేకంగా రూపొందిస్తున్నారట మిక్కీ. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో సమంత ఒక కీలక పాత్ర చేయనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు.