‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!

Vijay TVK party results

ముఖ్య అంశాలు
  • యాభై ఏళ్ల ద్రవిడ రాజకీయాలకు చెక్ పెడుతూ దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది.
  • అధికార డీఎంకే పార్టీ అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోగా, ప్రతిపక్ష అన్నాడీఎంకే రెండో స్థానంలో కొనసాగుతోంది.
  • మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 106 చోట్ల, అన్నాడీఎంకే 72, డీఎంకే 48 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.

తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. యాభై ఏళ్లుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న ద్రవిడ పార్టీలకు దళపతి విజయ్ గట్టి షాక్ ఇచ్చారు. ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయని రీతిలో తమిళనాట సరికొత్త ప్రభంజనం సృష్టిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ సునామీ సృష్టిస్తోంది. కౌంటింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే టీవీకే మ్యాజిక్ ఫిగర్ దిశగా అడుగులు వేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

కలవరపెడుతున్న కంచుకోటలు

అధికారంలో ఉన్న డీఎంకే ఎవరూ ఊహించని విధంగా మూడో స్థానానికి పడిపోవడం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పీడకలగా మారింది. 2011 నుంచి ఆయనకు కంచుకోటగా ఉన్న కొలత్తూరు నియోజకవర్గంలో కూడా ప్రతికూల పవనాలు వీస్తుండటం డీఎంకే శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఇక పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి బరిలోకి దిగిన విజయ్.. తొలి రౌండ్ నుంచే స్పష్టమైన లీడ్ సాధించి తమ సత్తా చాటుతున్నారు. దొరైమురుగన్, తంగం తెన్నరసు లాంటి సీనియర్ మంత్రులు సైతం వెనుకబడ్డారు. ఎడప్పాడి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మాత్రం తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ పార్టీని రెండో స్థానంలో నిలిపారు.

కోయంబత్తూరు నుంచి చెన్నై వరకు టీవీకే శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభిమానులు వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటున్నారు. కేవలం సినిమా గ్లామర్ మాత్రమే కాకుండా, బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న తమిళ ప్రజలకు విజయ్ రూపంలో కొత్త నాయకుడు దొరికాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాజిక్ ఫిగర్ దిశగా టీవీకే దూకుడు

తాజా సమాచారం ప్రకారం కౌంటింగ్ సరళిని గమనిస్తే టీవీకే మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 106 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమి 72 స్థానాల్లో, అధికార డీఎంకే కూటమి కేవలం 48 స్థానాలకే పరిమితమై లీడింగ్‌లో ఉన్నాయి. రాబోయే ఐదేళ్లు తమిళనాడులో విజయ్ మార్క్ పాలిటిక్స్ చూడబోతున్నామని ఈ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.

Exit mobile version