సినిమా చూసి ఏం తీశార్రా అన్నాదమ్ముళ్లు అనుకోవాలి – ఎన్టీఆర్

ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ సినిమా యొక్క ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ బీవిడుదల కోసం టీమ్ భారీ వేడుకను నిర్వహిస్తోంది. ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ ‘ముందుగా నేను, అన్నయ్య సినిమా తీయాలని అనుకున్నాం. కానీ ఎలాంటి సినిమా తీయాలో అర్థం కాలేదు. సినిమా హిట్, ఫ్లాపులు మా చేతుల్లో లేవు. కానీ అభిమానులు మా సినిమా చూసి ఏం తీశార్రా అన్నాదమ్ముళ్లు అనుకోవాలి, అలాగే తల్లిదండ్రులు మంచి సినిమా తీశారు మా కన్న కొడుకులు అనుకోవాలి, వీటన్నిటికంటే మనమిద్దరం ఏదేమైనా గొప్ప సినిమా తీశాం అనుకోవాలి అనుకున్నాం’ అన్నారు.

అలాగే ‘మా కోరిక మేరకే దేవుడు బాబీని పంపాడు. బాబీ కథ చెప్పగానే భయమేసింది. చేయగలనా లేదా అనే సందేహం కలిగింది. కానీ మా కోరిక తీరడానికి కావల్సిన అన్ని ఆయుధాలు బాబీ తీసుకొచ్చిన కథలో ఉన్నాయి. ఆ తర్వాత వారం రోజులకి బాబీని పిలిచి ఓకే అన్నాను. ఈ కథని నా ఇద్దరు సన్నిహితులకు చెప్పాం. వాళ్ళు కూడా బాగుంది సక్సెస్ అవుతుందన్నారు. సినిమా విజయవంతం అయ్యాక వాళ్ళ పేర్లు చెబుతాను’ అంటూ ‘సినిమా బాగుంటుందని నమ్ముతున్నాను, మీకు, అమ్మానాన్నలకు గర్వకారణంగా ఉంటుందని అనుకుంటున్నాను’ అన్నారు.