పోలీసులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్ !

ntr
ఎన్టీఆర్, ఆయన కుటుంబం శనివారం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం రాజమండ్రి వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే మధ్యలో కాకినాడను కూడా సందర్శించారాయన. ఎన్టీఆర్ రాజమండ్రికి వస్తున్నారన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి, కాకినాడకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. దీంతో చాలా సేపు ఎన్టీఆర్ పర్యటించిన ప్రాంతాల్లో భారీ కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం కాకినాడ, రాజమండ్రిలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, తారక్ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆయన పర్యటన సాఫీగా సాగేలా చూశారు. కార్యక్రమం తరువాత హైదరాబాద్ తిరిగొచ్చిన తారక్ ట్విట్టర్ ద్వారా ‘అంతా సవ్యంగా జరిగేలా చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా స్పెషల్ థ్యాంక్స్. మర్చిపోలేని స్వాగతం పలికి కాకినాడ, రాజమండ్రి అభిమానుల ప్రేమను కూడా నా థాంక్స్’ అంటూ పోలీసులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.