‘జనతా గ్యారెజ్‌’పై పుకార్లను కొట్టిపడేసిన టీమ్!

27th, July 2016 - 06:40:29 PM

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా కోసం అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొదట్లో ఆగష్టు 12న విడుదలవుతుందనుకున్న ఈ సినిమా, చివరినిమిషంలో సెప్టెంబర్ 2కు మారిపోయింది. ప్రస్తుతం టీమ్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సమాంతరంగా పూర్తి చేస్తోంది. ఇక డబ్బింగ్ విషయంలో ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు, దర్శకుడు కొరటాల శివకు బేధాభిప్రాయాలు వచ్చాయని, దీంతో ఆ పనులు ఆగిపోయాయని ప్రచారం జరుగుతోంది.

కాగా ఈ విషయమై టీమ్‌ని సంప్రదించగా అలాంటివేమీ లేదని, జనతా గ్యారెజ్‌పై వస్తోన్న ఇలాంటి పుకార్లను అభిమానులు నమ్మొద్దని తెలిపింది. అదేవిధంగా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని, ఎన్టీఆర్ ఎనర్జీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని టీమ్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఆగష్టు నెలలో విడుదల కానుంది.