లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను బహిర్గతం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ‘ఎక్స్’ (ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.
బాధితురాలి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం..
ఈ కేసులో పిటిషనర్ తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు ఎన్. వాదనలు వినిపించారు. బాధితురాలి ఫొటోలు, గుర్తింపు వివరాలు డిజిటల్ వేదికలపై కొనసాగుతుండటం వల్ల ఆమె గోప్యత, గౌరవానికి తీవ్ర భంగం కలుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత ప్లాట్‌ఫామ్‌ల గ్రీవెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో, ఐటీ చట్టాలు మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
ఆగస్టు 20కి విచారణ వాయిదా..
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి.. యూట్యూబ్, గూగుల్, మెటా, ‘ఎక్స్’ సంస్థలతో పాటు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు. పిటిషన్‌లో పేర్కొన్న 200కు పైగా వివాదాస్పద యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ‘ఎక్స్’ పోస్టులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను 2026 ఆగస్టు 20కి వాయిదా వేశారు.
లైంగిక నేర బాధితుల డిజిటల్ గోప్యత, గౌరవాన్ని కాపాడడంలో ఈ ఉత్తర్వులు కీలకమైన ముందడుగుగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. బాధితుల గుర్తింపును బహిర్గతం చేసే కంటెంట్‌ను తొలగించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలపై ఉందనే అంశాన్ని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.
