ఇంటర్వ్యూ : విశాల్ – తెలుగు ప్రేక్షకులు నా సినిమాల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు !

5th, November 2017 - 04:00:19 PM

తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘తుప్పరివాలన్’ తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఆ చిత్రాన్ని ‘డిటెక్టివ్’ పేరుతో ఈ నెల 10న తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాల్ మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమా గురించి చెప్పండి ?
జ) ఈ సినిమా గత నెలలో తమిళంలో ‘తుప్పరివాలన్’ పేరుతో విడుదలై బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం నాకు మంచి పేరుని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

ప్ర) మీ దర్శకుడు మిస్కిన్ గురించి చెప్పండి ?
జ) అతనికి తమిళనాట మంచి పేరుంది. ఎప్పుడూ కొత్త తరహా సినిమాల్ని ట్రై చేస్తుంటారు. గత 8 ఏళ్లుగా సినిమా చేయాలని అనుకుంటున్నాం. చివరికి ఈ సినిమాతో కుదిరింది. ఆయన చాలా ప్రతిభ గల వ్యక్తి.

ప్ర) సినిమాలో ప్రసన్న రోల్ ఎలా ఉంటుంది ?
జ) సినిమాలో నా స్నేహితుడిగా నటించాడు. పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న చిత్రం. ప్రసన్న కూడా చాలా బాగా నటించాడు.

ప్ర) సినిమాలోని ఇతర నటీనటుల గురించి చెప్పండి ?
జ) ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ మంచి పాత్ర చేసింది. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. సినిమా పట్ల ఆమె అంకితభావం చాలా గొప్పది.

ప్ర) తెలుగు వెర్షన్ పై మీ అంచనాలేమిటి ?
జ) తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా సినిమాల్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. అలాగే ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. డిటెక్టివ్ జానర్లో రూపొందిన ఈ చిత్రం అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుందని నేను మాటిస్తున్నాను.