శ్రీదేవిని ఎత్తుకొని గోదారి దాటిన దర్శకేంద్రుడు

Published on Apr 24, 2020 9:58 pm IST

ఘన చరిత్ర కలిగిన సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన అపురూప చిత్రాలలో దేవత మూవీ ఒకటి. 1982లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అప్పుడు వరుస విజయాలు అందుకుంటూ సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు. అందాల హీరో శోభన్ బాబు హీరోగా అప్పటి స్టార్స్ శ్రీదేవి, జయప్రద హీరోయిన్స్ గా ఈ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కింది. శోభన్ బాబు ఆసమయంలో వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. హిట్ కొడితే కానీ కెరీర్ లో ముందుకు పోనీ పరిస్థితి. ఆ సమయంలో దేవత రోపంలో ఆయన ఓ సూపర్ హిట్ అందుకున్నారు .

ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ శ్రీదేవీదే. ఆమె త్యాగమే ఈ మూవీ అసలు కథ. రాఘవేంద్రరావు మార్క్ రొమాన్స్, ఎమోషన్స్ కలగలిపి ఈ మూవీ చక్కగా కుదిరింది. ఇక దేవత సినిమా గురించి చెప్పుకుంటే అందులోని ‘వెల్లువొచ్చి గోదారమ్మ..’ పాట గురించి మాట్లాడుకోవలసిందే. ఇప్పటికి కూడా పల్లెల్లో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది. కాగా ఈ పాట చిత్రీకరణ సమయంలో ఓ విచిత్ర సంఘటన జరిగిందట.

ఈ పాట గోదావరి నదిలోని పాయ మధ్యలోని ఇసుక దిబ్బపై చిత్రీకరించారు. గోదారి వొడ్డున కార్వాన్ లో మేకప్ అయిన తరువాత నదిలోకి షూటింగ్ కి వెళ్లేవారట. పొడుగు లంగా, జాకెట్ ధరించి ఉన్న శ్రీదేవి నదిలోని ఆ ఇసుక దిబ్బకు చేరాలంటే ఓ చిన్న నీటి పాయ దాటాలట. మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్న ఆ పాయను దాటాలంటే శ్రీదేవి బట్టలు తడిసిపోయే పరిస్థితి ఉందట. దీనితో హీరో శోభన్ బాబును శ్రీదేవిని ఎత్తుకోవలసిందిగా నిర్మాత రామానాయుడు కోరారట. దానికి శోభన్ బాబు ససేమిరా అన్నారట. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావుకి శ్రీదేవిని ఎత్తుకొని ఏరు దాటించే పని తప్పలేదట. ఆ పాట షూటింగ్ ముగిసే వరకు రాఘవేంద్ర రావుకి శ్రీదేవిని ఎత్తుకొని ఏరు దాటించడం పనిగా మారిపోయిందట. ఓ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.

సంబంధిత సమాచారం :

X
More