‘ధృవ’లో అలాంటి మార్పులేవీ చేయలేదట!

surender-reddy
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’, సినీ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈనెల 9న భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదట్నుంచీ చెబుతూ వస్తోన్న టీమ్, ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఈ ప్రమోషన్స్‌లోనే భాగంగానే మాట్లాడుతూ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ అయిన ఈ సినిమా కోసం పెద్దగా మార్పులేవీ చేయలేదని, అవసరం అనుకున్నంత వరకే కొన్ని మార్పులు చేసి ఒరిజినల్‌ కథని అలాగే ఉంచామని సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా థ్రిల్లర్ పంథాలో సాగే ఇలాంటి కథలో నేటివిటీ పేరుతో మార్పులు చేస్తే అసలుకే మోసం వస్తుందని ఆయన అన్నారు. తమిళంలో 2 గంటల 39 నిమిషాల నిడివి ఉన్న సినిమా, ఇక్కడే అంతే రన్‌టైమ్‌తో ఉంటుందని, తెలుగులో ఒక పాటను అదనంగా జోడించామని సురేందర్ రెడ్డి తెలిపారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించగా, అరవింద్ స్వామి విలన్‌గా నటించారు.