ఈసారి ఎన్టీఆర్ టార్గెట్ కాస్త పెద్దదే !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆరంభం నుండి మంచి అంచనాలను కలిగి ఉన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చూపింది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ ఈ చిత్రం ద్వారానే జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ సుమారు రూ.115 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. వీటిలో తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.86 కోట్లు ఉండగా తెలుగు శాటిలైట్ హక్కులు రూ .14 కోట్లు, హిందీ శాటిలైట్, డబ్బింగ్ హక్కులు రూ.11 కోట్లు ఉన్నాయి.

ఈ మొత్తం చూస్తే ఈసారి తారక్ టార్గెట్ కాస్త పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కొనుగోలుదారులకు ఈ మొత్తం రికవర్ అవ్వాలంటే సినిమా భారీ విజయాన్ని సాదించాలి. అందుకే ఓపెనింగ్స్ నుండే వసూళ్లను కొల్లగొట్టేందుకు చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. పైగా సినిమాకున్న పాజిటివ్ బజ్ కు తోడు మొదటిరోజు గనుక హిట్ టాక్ వచ్చి, లాంగ్ రన్ పొందగల సత్తా సినిమాలో ఉంటే ఈ టార్గెట్ ను ఛేదించడం తారక్ కు పెద్ద కష్టమేమీ కాదు. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే 21వ తేదీ వరకు ఆగాల్సిందే.