శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 86 వ జయంతి సందర్భంగా…. ప్రత్యేక కథనం.

Published on Apr 23, 2020 7:08 pm IST

తీసిన 10 సినిమాలు కళా ఖండాలే… అదుపు తప్పిన సినిమాలకు “కాపు” కాసిన నిర్మాతకు గుర్తింపు ఏది? ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపు తప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934 , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు . నేడు ఆయన 86వ జయంతి .

ఏడిద నాగేశ్వరరావు మూడు పదుల సినీ జీవితం నిర్మాణ సారధి గా తన మిత్రులతో కలిసి “ సిరి సిరి మువ్వ “ తో మొదలయి, 1979లో పూర్ణోద‌య సంస్థ‌ను స్థాపించి పదే పది సినిమాలను నిర్మించారు. ఈ పది చిత్రాలు కూడా కళాత్మక చిత్రాలుగా, తెలుగువాడి ఆత్మ‌గౌర‌వానికి సింబాలిక్‌గా ఓ అరుదైన సంత‌కంలాగా నిలిచిపోయాయి. ‌మొదటి సినిమా ‘తాయారమ్మ బంగారయ్య’ ఆరోగ్యకరమైన హాస్య భరిత చిత్రంగా అల‌రించింది. రెండవ సినిమా శంకరాభరణం(1980). ఈ సినిమా,తెలుగు జాతికి, ఏడిదకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అలాగే అరుదైన `స్వర్ణ కమలం` జాతీయ పుర‌స్కారాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబలి` చిత్రానికి మాత్ర‌మే స్వ‌ర్ణ‌క‌మ‌లం ద‌క్కింది.

కమర్షియల్ ‌ సినిమా హవా నడుస్తోన సమయంలో ఈ సినిమా అప్పట్లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. తర్వత దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. చిరంజీవి ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో ‘స్వయం కృషి’లో న‌టించారు. చిరంజీవి ఏమిటి! చెప్పులు కుట్టేవాడి పాత్రా? అనలేదు. ఈ కథ చిరంజీవిని ఆకట్టుకోవడమే కాదు.. తెలుగోడు త‌లెత్తుకునేలా గొప్ప‌ విజయం సాధించింది. ఈ సినిమా రష్యన్ ‌ భాషలోకి అనువాదమైంది. అంతకు ముందు ఆయన చిత్రాలన్నీ రష్యన్ భాషలోకి అనువదించి గొప్ప విజయాన్ని సాధించాయి .

ఏడిద వారి మరో చిత్రం ‘ఆపద్భాందవుడు’ , చిరంజీవి నట జీవితంలో ఓ మైలు రాయి , మెగాస్టార్ చేస్తున్న ఎన్నో సామాజిక కార్యక్రమాల మూలంగా , ఇప్పుడు కరోనా మహమ్మారి వలన ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు అండగా CCC ప్రారంభించి మరో సారి ఆపత్బాంధవుడు అనే పేరును సార్ధకం చేసుకున్నారు . ఆ చిత్రం లోని నటనకు ఉత్తమ నటుడిగా చిరంజీవి రెండవ సారి ఎంపికయ్యారు.

కమల్‌హాస‌న్‌ నటించిన ‘సాగరసంగమం’ “ స్వాతి ముత్యం “ చిత్రాలకి ఎన్నో అంతర్జాతీయ ,జాతీయ ,రాష్ట్ర బహుమతులు వరించాయి . అలాగే ఇప్పటివరకూ ఆస్కార్ కి నామినేషన్ కి వెళ్లిన ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం .మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరుచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతిన గౌరవించింది ? అని ప్ర‌శ్నించుకుంటే.. కనీసం పద్మశ్రీ‌ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు. మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా? అన్న‌ది ట‌న్ను బ‌రువైన ప్ర‌శ్న‌.

ఓ ర‌కంగా ప్రభుత్వాల కంటే ప్ర‌యివేటు సంస్థ‌లే ఆయ‌న ప్రతిభను బాగా గుర్తించాయి. కళా సాగర్ వారు దశాబ్తపు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి గౌర‌cవించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, `సంతోషం` లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి. పద్మశ్రీ , రఘుపతి వెంకయ్య అవార్డులు , ఆ వ్యక్తి మరణాంతరం ఇచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి . ఎవరైనా పెద్ద మనుషులు జోక్యం చేసుకొని కనీసం ఇప్పటికైనా ఏడిద నాగేశ్వరరావు గారికి ఆ గౌరవం దక్కేలా చూస్తే , మంచి తెలుగు సినిమాలకు వారు ఇచ్చే గౌరవం అవుతుంది ….

ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఆణిముత్యాలు – అవి సాధించిన కొన్ని అవార్డుల వివరాలు :
సిరి సిరి మువ్వ – రెండు జాతీయ అవార్డులు
తాయారమ్మ బంగారయ్య
శంకరాభరణం – ఓక అంతర్జాతీయ, నాలుగు జాతీయ ( స్వర్ణ కమలం ) ఎనిమిది రాష్ట్ర నంది అవార్డులు ( బంగారు నంది ) ఇంకా ఎన్నో ..
సీతాకోకచిలక – ఒక జాతీయ అవార్డు , నాలుగు రాష్ట్ర నంది అవార్డులు ( బంగారు నంది )
సాగర సంగమం – రెండు జాతీయ అవార్డులు, మూడు రాష్ట్ర నంది అవార్డులు
స్వాతిముత్యం – ఆస్కార్ కి నామినేషన్, ఒక జాతీయ అవార్డు
సితార – మూడు జాతీయ అవార్డులు
స్వయంకృషి – రాష్ట్ర నంది అవార్డు – చిరంజీవి కి తొలి సారి ఉత్తమ నటుడు
స్వరకల్పన
ఆపత్బాంధవుడు – నాలుగు రాష్ట్ర నంది అవార్డులు- చిరంజీవి కి రెండవ సారి ఉత్తమ నటుడు

సంబంధిత సమాచారం :

X
More