హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో టాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆనంద్ సాయి కుమారుడు తన కారుతో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి ప్రమాద స్థలం నుండి పరారైనట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ ప్రధాన శిల్పిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తుడిగా ఆనంద్ సాయికి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా అతని కుమారుడు నందులాల్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టగా, ఈ ప్రమాదంలో మరొక విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ప్రమాదం అనంతరం అక్కడి నుండి వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ ఉన్న ఆనంద్ సాయి కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
