విషాదం : ప్రముఖ నటుడు ‘వల్లభనేని జనార్దన్’ మరణం

టాలీవుడ్ సీనియర్ నటుడు వల్లభనేని జనార్దన్ నేడు ఉదయం 10 గం. 20 ని. లకు అనారోగ్య కారణాలతో అకాల మరణం పొందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇక నేడు ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వల్లభనేని జనార్దన్ కుటుంబసభ్యలు వెల్లడించారు.1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర పోతునూరులో ఆయన జన్మించారు. వల్లభనేని జనార్దన్ కు చిన్నప్పటి నుండి నాటకాల పై ఎంతో మక్కువ ఉండేది. తన తోటి విద్యార్థులతో కలిసి పలు నాటకాలు ప్రదర్శించి అందరి నుండి మంచి పేరు అందుకున్న జనార్దన్, తన కాలేజీ విద్య అనంతరం కళావారధి పేరుతో ఒక నాటక సంస్థను ఏర్పరిచి అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన గజదొంగ మూవీ ద్వారా తొలిసారిగా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వల్లభనేని జనార్దన్, ఆ తరువాత అనేక సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు కుమార్తె లళినీ చౌదరిని వివాహం చేసుకున్న జనార్ధన్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మూవీలో నటి సుమలత తండ్రిగా ఆయన పోషించిన పాత్ర నటుడిగా మరింత గుర్తింపుని తీసుకువచ్చింది. ఇక నేడు ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు వల్లభనేని జనార్దన్ అకాల మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version