‘పుష్ప‌’తో బాలీవుడ్‌లో టాలీవుడ్ మార్కెట్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్..!

‘పుష్ప‌’తో బాలీవుడ్‌లో టాలీవుడ్ మార్కెట్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్..!

Published on Feb 17, 2022 8:23 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు టార్చ్ బేరర్‌గా మారాడు. ఇతర ఇండస్ట్రీలలో తెలుగు మార్కెట్ ఓపెన్ చేస్తున్న హీరోలలో అల్లు అర్జున్ అందరి కంటే ముందున్నారు. ఇటీవల “పుష్ప” సినిమాతో బన్నీ సృష్టించిన సంచలనాల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో బాలీవుడ్ అంతా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు. స్టార్ హీరోల నుంచి చిన్న వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ నటనను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. పైగా సినిమాలో బన్నీ మేనరిజమ్స్ అన్నీ బయట ఫాలో అవుతున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎంతోమంది రీల్స్ చేసి వరల్డ్ పాపులారిటీ తీసుకొచ్చారు. అక్కడ 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో తెలుగు సినిమాలకు బాలీవుడ్ మార్కెట్ ఓపెన్ చేసిన హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

ఇదివరకు కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే ముందు నుంచి ప్లాన్ చేసుకుని నిర్మాతలు హిందీలో విడుదల చేసేవారు. మరోవైపు తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ రైట్స్ మాత్రమే అమ్మేసి థియేట్రికల్ రిలీజ్‌కు దూరంగా ఉండేవాళ్లు. అది టీవీలో, యూట్యూబ్‌లో విడుదలయ్యేవి. కానీ పుష్ప తర్వాత మాత్రం అలా కాదు.. తమ ప్రతీ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని హీరోలు నిర్మాతలను కోరుతున్నారు. దానికి కారణం అల్లు అర్జున్. పుష్ప సినిమాను ఈయన ప్రమోట్ చేసిన తీరు హిందీలో అది వసూలు చేసిన వసూళ్లు చూసిన తర్వాత ప్రతీ హీరో కూడా బాలీవుడ్ మార్కెట్ కోసం కలలు కంటున్నారు. గతంలో మలయాళంలోనూ తెలుగు సినిమాలకు మార్కెట్ ఓపెన్ చేసిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఈయన సినిమాలకు అక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. మరోవైపు హిందీలోనూ బన్నీకి ముందు నుంచి మార్కెట్ ఉండేది కానీ పుష్ప తర్వాత అది మరింత పెరిగిపోయింది.

పుష్ప సినిమా సృ‌ష్టించిన ప్రభంజనం తర్వాత ప్రతి హీరో తమ సినిమాలను హిందీలో విడుదల చేస్తున్నారు. పుష్ప-2 వచ్చేసరికి ఆ మార్కెట్ మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కేవలం హిందీలోనే కాదు.. నేపాలీ, బెంగాలీ లాంటి భాషల్లోనూ బన్నీకి ఫాలోయింగ్ బాగానే ఉంది. అక్కడ కూడా ఈయన సినిమాలను చూస్తున్నారు ప్రేక్షకులు. త్వరలోనే అక్కడ కూడా అల్లు అర్జున్ సినిమాలు విడుదల కావడం ఖాయం. ఏదేమైనా బన్నీ టాలీవుడ్ టార్చ్ బేరర్ అవుతున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు మాత్రమే కాదు.. సినిమాలు వీలైనన్ని ఇండస్ట్రీలకు విస్తరిస్తున్న తీరు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. దీనినే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు